వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజారోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైయస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా విపరీతంగా పెరిగిందని, రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని, ప్రజలంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. ప్రజారోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని, అందుకు ఇప్పుడు విజృంభిస్తున్న డయేరియా రుజువుగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు తెలిపారు. అయినా ఈ ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని, వ్యాధి నుంచి ప్రజలను కాపాడడం లేదని, చివరకు కనీసం రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆయన ఫైరయ్యారు.