వైసీపీ అరాచక పాలన కారణంగా ఏపీ అన్ని రకాలుగా వెనుకబడిందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. తాము సంపద సృష్టిస్తున్నామని.. అందుకే అమరావతి చుట్టూ రహదారుల నిర్మాణం వేగంగా చేపట్టామని వివరించారు. సంపద సృష్టికి కొంత సమయం పడుతుందన్నారు. జీతాలు ఇవ్వాలి కాబట్టే కొంత అప్పులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఢిల్లీలో మంత్రి సత్యకుమార్ బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ను సత్యకుమార్ ఈరోజు(బుధవారం) కలిశారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామని అన్నారు. సంస్థాగతంగా పార్టీ విస్తరించేందుకు ప్రయత్నాలు చేయాలని చూస్తున్నామని వివరించారు.