ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ గెజిట్ జారీ కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. జీపీఎస్ నిలిపివేయాలని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంఓ సమాచారం సేకరిస్తుంది. సీఎం ఆదేశాలతో సీఎంఓ విచారణ చేపట్టింది. ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పని చేసే వాళ్లల్లో ఎవరు దీనికి కారకులనే దానిపై విచారిస్తున్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి, న్యాయ శాఖలోని సెక్షన్ ఆఫీసర్ హరి ప్రసాద్ రెడ్డి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరు అధికారుల గత చరిత్రని ఉన్నతాధికారులు తవ్వి తీస్తున్నారు. అధికారులిద్దరూ బిజినెస్ రూల్స్ పాటించారా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్టు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. చివరి ఆరు నెలల్లో పాత ప్రభుత్వంలో అమలు కాని నిర్ణయాల ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలని నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే. అమల్లో లేని పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పని సరని బిజినెస్ రూల్సులో ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జీవో జారీ చేయడం సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ అప్లోడ్ చేయడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ శాఖల్లో, మంత్రులు, అధికారుల పేషీల్లో ఇంకా ఎవరైనా కోవర్టులున్నారా అనే కోణంలో ప్రభుత్వ ఆరా తీస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన జూన్ 12వ తేదీన.. జీపీఎస్ విధానం 2023 అక్టోబరు 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంటూ ఆర్థిక శాఖ జీవో ఇచ్చింది. ఆ రోజున కీలక బాధ్యతల్లో ఉన్నది వైసీపీ అనుకూల అధికారులే. అప్పటికి కూటమి ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీ చేయలేదు. జూలై 12వ తేదీన అదే జీవో గెజిట్‌లో ప్రచురితమైంది. పాత తేదీతో కొత్త ప్రభుత్వంలో జీవో రావడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది. పలు ఉద్యోగ సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. అయితే ఇది రొటీన్‌గా జరిగిపోయిందని, ఇందులో ఎలాంటి కుట్రా లేదని ఆర్థిక శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.