ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా యువ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన డాక్డర్ తంగిరాల యశ్వంత్ మొన్నటి వరకు జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేశారు. తాజాగా కీలకమైన సీఎం కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాధ్యతల్ని అప్పగించగా.. సోమవారం బాధ్యతల్ని స్వీకరించారు. యశ్వంత్ జమ్మలమడుగు వంటి ప్రాతంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆయన్ను ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమించారు.
యశ్వంత్ మొదటి పోస్టింగ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు కాగా.. అక్కడ మంచి అధికారికగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతిలాంటి ముఖ్యమైన చోట్ల విధులు నిర్వహించారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో యశ్వంత్‌కు గుర్తింపు వచ్చింది. తిరుపతి నుంచి పుట్టపర్తికి డీఎస్పీగా వెళ్లారు.. ఆ తర్వాత అక్కడ నుంచి జమ్మలమడుగు డీఎస్పీగా బదిలీ అయ్యారు. యశ్వంత్ వెళ్లిన కొంత కాలానికే ఎన్నికల వచ్చాయి.. జమ్మలమడుగులు ఎన్నికలు సజావుగా జరగడంలో కీలకంగా వ్యవహఱించారు. ఎక్కడా ఎలాంటి పెద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. విధులు సమర్థవంతంగా నిర్వర్తించడంతో ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ విభాగం అధికారిగా నియమితులయ్యారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ యశ్వంత్ తల్లిదండ్రులు తంగిరాల నాగ జగన్నాధ్, శార్వాణిలు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. తంగిరాల నాగజగన్నాధ్ ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశారు.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. శార్వాణి ప్రస్తుతం కంభం మండల విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం కాగా.. యశ్వంత్ గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. యశ్వంత్ ఐపీఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఆ దిశగా రెండుసార్లు సివిల్స్‌కు ప్రయత్నించారు. కానీ కొద్ది మార్కుల్లో సాధించలేకపోయారు.. 2015లో గ్రూప్ 1 రాశారు. తొలియ ప్రయత్నంలోనే ఎంపికకాగా.. డీఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. యశ్వంత్ ఏడాది పాటూ శిక్షణ తర్వాత 2016లో పుత్తూరు డీఎస్పీగా నియమితులయ్యారు.