దేశ రక్షణలో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని డోడా జిల్లాలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన డొక్కరి రాజేష్.. నందిగాం మండలం వల్లభరాయపాడుకు చెందిన జగదీశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరి భౌతిక కాయాలు ఇవాళ సొంత ఊళ్లకు తీసుకురానున్నారు.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన డొక్కరి చిట్టయ్య, పార్వతి దంపతులకు రాజేష్ పెద్దకుమారుడు. దండుగోపాలపురంలో పదో తరగతి వరకు చదివారు.. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు.టెక్కలిలో డిగ్రీ చదువుతుండగా.. ఆర్మీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. 2018లో ఎంపికయ్యారు. ఆయనలో టాలెంట్‌ను గమనించిన అధికారులు రైఫిల్స్ టీమ్‌లోకి తీసుకున్నారు. రాజేష్ ఇటీవల సెలవుపై సొంత ఊరికి వచ్చి.. మూడు నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తానని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పారు.
జమ్మూకాశ్మీర్‌లోని డోడా జిల్లాలో మూడు రోజుల నుంచి ఉగ్రవాదుల కోసం సైన్యం గాలిస్తోంది. ఈ టీమ్‌లో రాజేష్ కూడా ఉన్నారు.. అయితే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాజేష్ మెడకు ఎదురు కాల్పుల్లో బుల్లెట్ తగిలింది.. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో రాజేష్‌కు చిన్న గాయమైందని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.. కానీ మంగళవారం రాజేష్ చనిపోయారని సమాచారం ఇచ్చారు. కుమారుడి మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. రాజేష్ భౌతిక కాయం ఇవాళ విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకువస్తారు.. అక్కడి నుంచి సొంత ఊరికి తరలిస్తారు. అక్కడ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండగా.. జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సనపల జగదీశ్వరరావుది నందిగాం మండలం వల్లభరాయపాడుకు కాగా.. ఆయన 22 ఏళ్ల నుంచి సైనంలో సేవలు అందిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. ప్రస్తుతం హవల్దారుగా ఉన్నారు. ఈ నెల 15న ఉదయం డోగ్రా దగ్గర విధి నిర్వహణలో ఉన్నారు.. అక్కడ జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. తండ్రి గురించి కుమార్తెలు ఇద్దరు అడుగుతుంటే.. వారికి ఏం చెప్పాలో తెలియక తల్లి కన్నీళ్లుపెట్టుకున్నారు. జగదీశ్వరరావు సతీమణి సమత దిమిలాడ సచివాలయంలో మహిళా పోలీ్‌సగా విధులు నిర్వర్తిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేష్, జగదీశ్వరరావు మరణంపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లు డొక్కరి రాజేష్, సనపల జగదీశ్వరరావు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు సిక్కోలు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి సేవలకు దేశ ప్రజలంతా రుణపడి ఉంటారని.. బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఫోన్‌లో పరామర్శించారు.