ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేయటంలో సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి చనిపోయాడు. బాలిక మృతదేహాన్ని మాయం చేయటంలో మైనర్లకు సహకారం అందించారనే ఆరోపణలపై నలుగురు కుటుంబసభ్యులను పోలీసులు మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు.వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వారిలో ఒకరైన నందికొట్కూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి మిడుతూరు పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పదంగా చనిపోయినట్లు తెలిసింది. నిందితులైన ముగ్గురు మైనర్ బాలురలో ఒకరికి హుస్సేన్ మేనమామ అని తెలిసింది.
విచారణ క్రమంలో హుస్సేన్ అలియాస్ యోహాన్ అనే వ్యక్తిని పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారించే క్రమంలో ఆయన చనిపోయినట్లు సమాచారం. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే హుస్సేన్‌ను లాకప్ డెత్ చేశారంటూ బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో హింసించడం వలనే చనిపోయారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహం ఇంకా కనిపించడం లేదు. పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జులై ఏడో తేదీన ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగుచూసింది. బాలిక కనిపించడం లేదనే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణలో ముగ్గురు మైనర్ బాలురు బాలికపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మృతదేహాన్ని కేసీ కెనాల్ గుట్టపై నుంచి పడేసినట్లు తొలుత చెప్పారు. దీంతో పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కృష్ణా నదిలో పడేశామని చెప్పటంతో అక్కడ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.
మరోవైపు ఈ ఘటనలో నిందితులకు వారి తండ్రులు సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో జులై 16న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసును ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం తరుఫున పదిలక్షల పరిహారం అందించారు. అలాగే బాలిక ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు, స్కూబా డైవర్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు.