మరికొన్ని రోజుల్లో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక హామీలను గుప్పించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం ప్రారంభించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కీ గ్యారెంటీ పేరుతో 5 హామీలను ప్రకటించింది. ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్, ఉచితంగా విద్య, ఉచిత వైద్యం, మహిళలకు నెల నెల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లాంటి పథకాలను హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే హర్యానాలోని పంచకులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల ప్రచార సభకు సునీతా కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. రాజ్యసభ ఎంపీలు దుర్గేష్ పాఠక్, సంజయ్ సింగ్‌లు పాల్గొన్నారు. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. కేజ్రీవాల్ కీ గ్యారెంటీ అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. హర్యానా ప్రజలకు ఉచిత కరెంటు, మొహల్లా క్లీనిక్‌ల ద్వారా ఉచిత వైద్యం, ఉచిత విద్య, హర్యానాలోని మహిళలకు నెలకు రూ.1000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుత హర్యానా అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 3 వ తేదీతో ముగియనుండటంతో అక్టోబరులోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రసంగించిన సునీతా కేజ్రీవాల్.. దేశ రాజధాని ఢిల్లీని అరవింద్ కేజ్రీవాల్ పరిపాలిస్తాడని ఎవరూ కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ఇది చిన్న విషయం కాదని.. ఒక అద్భుతం కంటే తక్కువ కాదని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ ఏదో చేయాలని దేవుడు కచ్చితంగా అనుకుంటున్నాడని తాను భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ సున్నా నుంచి మొదలుపెట్టి.. సొంత పార్టీ పెట్టుకుని ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యాడని సునీతా కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21 వ తేదీన అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.