చీపురుపల్లిలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఆదివారం శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లుతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను కూడా కూరగాయలతో అలంకరించారు. కార్యక్రమంలో అర్చకులు ఆరవిల్లి శ్రీనివాసరావు, రవి కుమార్, ఈవో జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరులతల్లి పైడిమాంబ ఆదివారం శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వనం, చదురుగుడుల్లో కూడా ప్రత్యేక పూజలు జరిగాయి. జై పైడిమాంబ నామస్మరణతో మూడులాంతర్ల వద్దనున్న చదురుగుడి మార్మోగింది. ఈవో డీవీ ప్రసాదరావు, ఆలయ సూపరింటెండెంట్ ఏడు కొండలు, అర్చకులు, సిబ్బంది శాకంబరి అలంకరణ ప్రక్రియలో పాల్గొన్నారు.