కేంద్రం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులపై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రోజు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవి ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధితోపాటు సామాజిక లక్ష్యాలను సాధించడంలో దొహదకారి అవుతాయి. మా పోరాటాన్ని గుర్తించి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, మానవ వనరుల అభివృద్ధి వంటి అన్ని ముఖ్యమైన రంగాలను స్పృశిస్తూ.. ప్రత్యేకతతో కూడిన సంపూర్ణ ప్యాకేజీ అందించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా గర్వకారణం. అమరావతి, పోలవరానికి అందించిన సహకారాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. నవ్యాంధ్ర చరిత్రలో ఈ రోజు.. మరచిపోలేని శుభదినం. ఇది రాష్ట్రాభివృద్ధి కోసం.. తమ కలలు నెరవేర్చుకొనేందుకు ఇది తొలి అడుగు అని మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే జగన్ ప్రభుత్వ పాలనలో గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలకు, అదే విధంగా ప్రస్తుతం టీడీపీ పాలనలో రాష్ట్రాభివృద్ది కోసం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రులు సోదాహరణగా వివరిస్తున్నారు.