తిరుపతి జిల్లా లో ఓ భార్య ఏర్పరచుకున్న వివాహేతర సంబంధం చివరకు ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. కన్న బిడ్డల ఎదుటే ఆ తల్లి కర్కశంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం విస్తుపోయేలా చేసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముసలిపేడుకు చెందిన నరేష్, ధనలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే ఎలా ఏర్పడిందో, ఏ బలహీన క్షణంలో కుదిరిందో తెలియదు కానీ.. ధనలక్ష్మికి హరి అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు తెలియకుండా చాలా రోజుల నుంచి వీరి మధ్య సంబంధం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇటీవలే ముసలిపేడు నుంచి నరేష్ కుటుంబం తిరుపతిలోని పాడిపేటకు మకాం మార్చింది. ఇది జరిగి పది రోజులు కావొస్తోంది. అయితే ఇటీవలే తన భార్య వ్యవహారం నరేష్‌కు తెలిసింది. దీని గురించి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. భార్యను తీరు మార్చుకోవాలంటూ నరేష్ హెచ్చరించినట్లు సమాచారం.
తమ సంగతి తెలిసిపోవటంతో ధనలక్ష్మి ఏ భార్యా తీసుకోని నిర్ణయం తీసుకుంది. ప్రియుడు హరితో కలిసి నరేష్‌ను అడ్డు తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. దీని గురించి ప్రియుడు హరితో కలిసి స్కెచ్ వేసింది. ఓ రోజు రాత్రి నరేష్‌ను చంపేయాలని ధనలక్ష్మి, హరి ప్లాన్ చేశారు. అయితే ఇవేవీ తెలియని నరేష్.. ఆ రోజు రాత్రి గాఢ నిద్రలోకి చేరుకున్నాడు. అదే తన శాశ్వతనిద్రగా మారుతుందని పాపం ఊహించలేకపోయాడు. భర్త నరేష్ గాఢ నిద్రలో ఉన్న సంగతిని గమనించిన ధనలక్ష్మి.. ప్రియుడు హరికి సమాచారం అందించింది. అర్ధరాత్రి సమయంలో నరేష్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు..దిండుతో అదిమిపట్టి నరేష్‌ను హరి హత్య చేశాడు.
ఈ సమయంలో ఇద్దరు పిల్లలకు మెలకువ రాగా.. వారు గట్టిగా అరవకుండా ధనలక్ష్మి పిల్లల నోటిని గట్టిగా అదిమిపట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. నరేష్‌ను హత్య చేసిన హరి, ధనలక్ష్మి.. అ నేరం నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. హత్య చేసిన అనంతరం నరేష్ మృతదేహానికి ఉరివేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నరేష్ కూతురు శ్రీనిధి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన హరి కోసం గాలిస్తున్నారు. ఆ రకంగా బలహీన క్షణంలో ఏర్పరచుకున్న వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు పిల్లలకు తండ్రి దూరమయ్యాడు.. తల్లి ప్రేమ లేకుండా పోయింది.