ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. అంతరించిపోతున్న అడవి దున్నల్ని సంరక్షించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు దేశీయ అడవి దున్నల్ని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోకి వదలాలని భావిస్తున్నారు. మూడు నుంచి నాలుగు బ్యాచ్‌లుగా 20 అడవి దున్నల్ని టైగర్ రిజర్వ్‌లోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తోంది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి తెలిపారు. తాము ఆంధ్ర ప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో అడవి దున్నల జన్యు వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి ప్రాజెక్ట్‌ను కూడా సమర్పించామని.. సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు చెప్పుకొచ్చారు.
నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోకి ఈ దేశీయ అడవి దున్నల్ని ప్రవేశపెట్టడానికి అటవీ శాఖ వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి సాంకేతిక సహాయాన్ని కోరినట్లు మూర్తి తెలిపారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అడవి దున్నల జాతిని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తోందని.. అందుకే వీటిని తిరిగి తీసుకొస్తున్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పులల సంఖ్యను పెంచే విధంగా.. వాటి వేటకు అనువైన జాతిగా ఉండే ఈ దేశీయ దున్నపోతుల్ని తిరిగి తీసుకురావాలని ప్రముఖ వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డాక్టర్ ఏజీటీ జాన్‌సింగ్ సలహా ఇచ్చారన్నారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణుల అభయారణ్యంలో వీటిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారన్నారు.
అటవీశాఖ తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్, విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ పార్క్ నుంచి ఈ అడవి దున్నల్ని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకురావాలని అటవీశాఖ ప్రతిపాదించినట్లు చెప్పారు మూర్తి. అలాగే పాపికొండ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం నుంచి కూడా కొన్ని అడవి దున్నల్ని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్‌కు తరలించాలని భావిస్తున్నారని చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఈ దేశీయ దున్నపోతుల సంతతి తగ్గిపోయిందని మూర్తి తెలిపారు.
మరోవైపు నల్లమల అటవీ ప్రాంతంలోని వెలుగోడు రేంజ్‌లో అడవి దున్న సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ దున్నపోతు ప్రస్తుతం ఇది బైర్లూటి ఎకో టూరిజం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తాజాగా తేలింది. ఈ ఏడాది జనవరిలో అడవి దున్నను వెలుగోడు రేంజ్‌లో మొదటిసారి గుర్తించారు. ఈ దున్న అడివిలో గస్తీ తిరిగే సిబ్బందికి అప్పుడప్పుడు కనిపించింది.. గత నెలలో బైర్లూటి రేంజ్‌లో గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఈ దున్నపోతు కర్ణాటక వైపు నుంచి వచ్చి ఉంటుందని భావిస్తు్నారు. కర్ణాటక వైపు నుంచి వచ్చి కృష్ణానదిని దాటుకుని నల్లమలలోకి వచ్చి ఉండొచ్చని.. పశ్చిమ కనుమల్లో సంచరించే అడవి దున్నలు వందల కిలోమీటర్లు ప్రయాణించి నల్లమలకు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది ఒక్కటే ఉందా, ఇంకా ఉన్నాయా అనే కోణంలో ఫోకస్ పెట్టారు.