వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అలాగని భయపడి వెనక్కి తగ్గం. రాష్ర్టాన్ని తిరిగి నిలబెడతాం. పునర్నిర్మాణం చేస్తాం. రాష్ర్టాన్ని గాడిలో పెట్టేవరకూ కూటమిలోని పార్టీలన్నీ సమష్టిగా పనిచేస్తాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకేసారి అన్నీ చేసేస్తామని చెప్పలేమని, అలాగని రాష్ర్టాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడపడం అసాధ్యమేమీ కాదని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంగళవారం శాసనసభలో ఆయన ప్రసంగించారు. ‘‘రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఇప్పటికీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి. మొదటి ఐదేళ్లు అమరావతి రాజధానిగా ఉంది. గత ఐదేళ్లూ మూడు రాజధానుల ముచ్చటతో కాలం గడిపారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేశారు. చివరికి బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి వచ్చింది. అందరం కలిసి ఏపీని అగ్రస్థానానికి చేర్చాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.