ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకూ ఈ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకూ ఈ పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌తో పాటుగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అమల్లో ఉంటుందని తెలిపారు.
మరోవైపు అమరావతి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయంతో పాటుగా వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి వారానికి ఐదురోజులు మాత్రమే పని కల్పించింది. ఈ విధానం గతంలోనూ ఉండగా ఏపీ ప్రభుత్వం ఇటీవలే మరో ఏడాదిపాటు ఈ విధానాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డ్యూటీ రోజుల్లో ఉదయం పది నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఉద్యోగుల సంఘం వినతితో సీఎం చంద్రబాబు ఇటీవలే ఈ ఫైలు మీద సంతకం చేశారు. దీనిపై ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జులై నెలకు సంబంధించి నెల మొదట్లోనే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించింది. జులై ఒకటో తేదీ నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతూ వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు కారణంగా.. జీతాల చెల్లింపులో కాస్త జరుపుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు నెల తొలిరోజే జీతాలు జమచేస్తూ వచ్చింది. దీనిపైనా ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఆ రకంగా ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.