ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందా అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని.. ఇటీవల పరిణామాలు ఎంతో బాధించాయన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా కొనసాగనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 45 రోజుల్లోనే 30 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. వందలకుపైగా హత్యాయత్నాలు జరిగాయని.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారన్నారు. రాష్ట్రంలో ఈ 45 రోజుల్లోనే వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారన్నారు జగన్. రాష్ట్రంలో గిట్టని వారి పంటలను నాశనం చేశారన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ రెడ్‌బుక్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయించారన్నారు. తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమన్నారు జగన్. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడుల, ఆస్తుల విధ్వంసం, చినీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశామని, వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దారుణస్థితిని అర్ధం చేసుకోవాలని.. వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఉందన్నారు. తమ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగిందని.. ఆయన వాహనాలు ధ్వంసం చేశారన్నారు.
గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదన్నారు జగన్. హత్యలు చేయలేదు.. దాడులు చేయలేదు.. ఆస్తుల విధ్వంసం చేయలేదన్నారు. ఎవరి ఇళ్లలోకి చొరబడి, వారిని వేధించలేదు.. ఎక్కడా పౌరుల హక్కులకు భంగం కలిగించలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని.. చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి విఘాతం కలుగుతుండటంతోనే ఢిల్లీకి వచ్చి నిరసన చేయాల్సి వస్తోందన్నారు.
రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు జగన్. రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని.. బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో అండగా నిలవాలని కోరారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నిరసనకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు.. జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు.