కేంద్రం ఇప్పటికే బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15000 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. అమరావతికి మరో కీలక ప్రాజెక్టును కేటాయించింది. విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణానది మీదుగా రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ 56 కిలోమీటర్ల మేర అమరావతి రైల్వే ప్రాజెక్టును చేపట్టనుంది. మొత్తం రూ.2,047 కోట్ల వ్యయంతో చేపట్టే అమరావతి రైల్వే ప్రాజెక్టు డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు నీతిఆయోగ్ ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మిగతా అనుమతుల కోసం మరికొంత సమయం పడుతుందని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు కేటాయింపులపై కేంద్ర మంత్రి బుధవారం ఢిల్లీలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపుల వివరాలను వెల్లడించారు.
ఏపీలో రైల్వే అభివృద్ధి కోసం బడ్టెట్లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే రూ.73,743 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వందశాతం రైళ్లను విద్యుదీకరించామన్న రైల్వే మంత్రి.. అమృత్ పథకంలో భాగంగా 73 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీలో ఇప్పటికే 743 ఫ్లై ఓవర్, అండర్ పాస్‌ల నిర్మాణం పూర్తైందని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వంలో జరిగిన కేటాయింపులు కంటే పదింతలు పెంచామని రైల్వే మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించారు. విశాఖ రైల్వే జోన్ కోసం గతంలో కేటాయించిన భూమికి బ్యాక్ వాటర్ సమస్య ఉందన్న మంత్రి.. ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.
మరోవైపు విజయవాడ నుంచి ముంబైకు వందేభారత్ రైలుపై రైల్వే మంత్రి కీలక వ్యా్ఖ్యలు చేశారు. విజయవాడ నుంచి ముంబైకు వందే భారత్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ మీదుగా పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్- విశాఖపట్నం, తిరుపతి- సికింద్రాబాద్, విజయవాడ- చెన్నై, కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కూడా వందేభారత్ రైలు నడిపితే బాగుండనే కోరిక ప్రయాణికుల్లో వ్యక్తమైంది. అయితే అది సాధ్యం కాదని రైల్వేమంత్రి స్పష్టం చేశారు.