కన్వర్ యాత్ర మొదలు కానున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ వారం రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కన్వర్ యాత్ర సాగే హాపూర్ జిల్లాలో ఈ వారం రోజుల సెలవులు అమలు కానున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ప్రేరణ శర్మ.. ఒక ప్రకటన చేశారు. ఇక కన్వర్ యాత్ర సందర్భంగా ఆ మార్గంలో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కొత్త నిబంధనపై తీవ్ర దుమారం రేగిన వేళ.. సుప్రీంకోర్టు స్టే విధించింది.
కన్వర్ యాత్ర నేపథ్యంలో హాపూర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వారం రోజులపాటు సెలవు ప్రకటిస్తూ.. కలెక్టర్ ప్రేరణ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఆగస్ట్ 2 వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కన్వర్ యాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కన్వర్ యాత్ర సందర్భంగా హాపూర్ జిల్లాలో భారీగా రద్దీ ఉంటుందని.. దాని వల్ల స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు రవాణాలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని కలెక్టర్ ప్రేరణ శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎవరూ సమస్యల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే సెలవు ప్రకటిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
ఇక కన్వర్ యాత్ర సాగే మార్గాల్లో ఉండే హోటళ్లపై వాటి యజమానుల పేర్లు రాసి ఉంచాలని మొదట ఉత్తర్‌ప్రదేశ్ సంచలన ఆదేశాలు తీసుకువచ్చింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. ఈ క్రమంలోనే ఈ 3 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని పేర్కొంది. అదే సమయంలో హోటల్ యజమానులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఆ హోటల్‌లలో ఎలాంటి ఆహారాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు.. మైనారిటీలను ఆర్థికంగా దెబ్బతీసేందుకేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని.. ఇలాంటి చర్యల వల్ల వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సియు సింగ్ పేర్కొన్నారు. ఇక 3 రాష్ట్రాల ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జూలై 26 వ తేదీకి వాయిదా వేసింది.