విజయనగరం జిల్లాలో ఉబాలు ఊపందుకున్నాయి. అన్నదాతలంతా పొలంబాట పట్టారు. అందుకనుగుణంగా వ్యవసాయ శాఖ సహకారం అందిస్తోంది. నిర్దేశించిన సమయంలోగా రైతులకు అన్ని మండలాల్లో విత్తనాలు అందించింది. రైతు సేవా కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేసింది. ఈ నెల 19 వరకూ వరణుడు కాస్త నిరాశపరిచినా 20వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురవడం ప్రారంభమైంది. చెరువులు, నదులు, రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 2 లక్షల 30 వేల ఎకరాల్లో వరిని పండించేందుకు అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 11,500 ఎకరాల్లో శతశాతం ఆకు అందుబాటులోకి వచ్చింది. 46 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించారు. 51 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 24 నాటికి 10 వేల ఎకరాల్లో ఉబాలు పూర్తయినట్టు వ్యవసాయాధికారుల అంచనా.. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది ఎనిమిది రెట్లు ఎక్కువ ఉబాలు జరిగాయి. గజపతినగరం, రాజాం, ఎల్.కోట, గంట్యాడ, బొండపల్లి తదితర మండలాల్లో ఉబాలు స్పీడు అందుకున్నాయి.