ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాలపై ఆదివారం ఆయన దేవస్థానం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాధి నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులందరికీ వసతి, సౌకర్యవంతమైన ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, పారిశుధ్యం నిర్వహణ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్సవాల సమయంలో క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్న క్రమంలో అందుబాటులో ఉండే డార్మిటరీ వసతిపై భక్తులకు అవగాహన కల్పించాలని చెప్పారు. డార్మిటరీ వసతికి సంబంధించి మరిన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పాతాళగంగలో స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని.. నిర్దేశించిన స్నానఘట్టాల్లోనే నదీస్నానాలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం కృష్ణా నదిలోకి వరద నీరు పెరుగుతుందని.. స్నానాలు చేసే సమయంల జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. కంచెను దాటి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని, నీటి సరఫరా విభాగం అధికారులు సూచించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభించి.. సాయంత్రం అల్పాహారం అందజేయాలన్నారు. ఉత్సవాలు జరిగే సమయంలో క్షేత్ర పరిధిలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించి.. శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం మంచినీరు, అల్పాహారం నిరంతరం అందజేస్తుండాలన్నారు. నిత్యకళారాధనలో భాగంగా శ్రావణమాసంలో ప్రత్యేకంగా ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రముఖ కవి, పండితులతో అవధాన కార్యక్రమాన్ని జరిపించాలన్నారు.