దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన బెంగళూరు కుక్క మాంసం సంఘటన కలకలంరేపుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి నిత్యం 14 వేల కిలోల కుక్క మాంసాన్ని బెంగళూరు నగరానికి రైలులో తరలించి.. అక్కడి నుంచి నగరంలో ఉన్న రెస్టారెంట్లు, హోటల్‌లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల యశ్వంత్‌పురా రైల్వే స్టేషన్‌కు జైపూర్ నుంచి వచ్చిన రైలులో ఉన్న మాంసం పెట్టెలను హిందూ సంఘాల కార్యకర్తలు అడ్డుకున్నారు. కుక్క మాంసాన్ని తీసుకువచ్చి.. మటన్ అని విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. మొత్తం 92 బాక్సుల్లో తీసుకువచ్చిన 2700 కిలోల మాంసాన్ని సీజ్ చేసి.. తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. టెస్ట్ చేసిన తర్వాత అది మేక మాంసమే అని ధృవీకరించారు.
అయితే అది మేక మాంసమే అయినా.. వేరే జాతికి చెందిన మేకల నుంచి తీసిందని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అధికారులు తేల్చారు. రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని నిర్ధారించారు. అది కుక్క మాంసం కాదని.. మేక మాంసం అని ల్యాబ్ రిపోర్ట్స్‌లో స్పష్టం అయినట్లు ఆహార భద్రత కమిషనర్ కె శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ఈ సిరోహి జాతి మేకలకు కొద్దిగా పొడుగు తోక ఉంటుందని.. వాటికి మచ్చలు కూడా ఉంటాయని వెల్లడించారు. దీంతో అది మటన్ కాదని.. కుక్క మాంసం అనుకుని భ్రమపడతారని చెప్పారు.
ఇక వివిధ రాష్ట్రాల నుంచి రోజూ బెంగళూరు నగరానికి 14 వేల కిలోల మటన్ సరఫరా అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంత మొత్తం మేక మాంసాన్ని బెంగళూరు నగరంలో ఉన్న హోటల్‌లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దొరికింది మేక మాంసం కాదని.. కుక్క మాంసం అని ఆరోపణలు వెల్లువెత్తడంతో నగరప్రజలు భయంతో వణికిపోయారు. తాజాగా అధికారులు అన్ని రకాల సైంటిఫిక్ టెస్ట్‌లు చేసి.. అది మేక మాంసం అని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.