మన దేశంలో ప్రతీ సంవత్సరం దాదాపు 50 వేల మంది ప్రజలు.. పాములు కాటు వేయడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తాజాగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో బీజేపీ నేత, సరణ్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ వెల్లడించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది పాముకాటు మరణాల్లో అత్యధికం భారత్‌లోనే చోటుచేసుకున్నట్లు సోమవారం లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ స్పష్టం చేశారు.
ఇక ప్రతీ ఏడాది మన దేశంలో 30 లక్షల నుంచి 40 లక్షల మందికి పాములు కాట్లు వేస్తున్నాయని.. అందులో 50 వేల మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. మిగిలిన వారు రకరకాల చికిత్సలు తీసుకుని.. ప్రాణాలు దక్కించుకుంటున్నారని వివరించారు. అయితే ఒక దేశంలో 50 వేల మంది చనిపోవడం అనేది చాలా పెద్ద విషయమని.. ప్రపంచ దేశాల్లో పాము కాటుతో చనిపోతున్న వారి సంఖ్యలో భారత్ తొలి స్థానంలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీహార్ రాష్ట్రం పేదరికంతోపాటు, తరచూ వచ్చే ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఎంపీ ప్రతాప్ రూఢీ వెల్లడించారు. చాలా పాము కాటు మరణాలను సత్వరం స్పందించి నివారించవచ్చని.. వాతావరణ మార్పులు కూడా ఈ పాము కాట్లపై ప్రభావం చూపిస్తున్నాయని ఆయన వివరించారు.
ఇక ఈ సందర్భంగా పలువురు ఎంపీలు.. లోక్‌సభలో కొన్ని అంశాలను లేవనెత్తారు. దేశంలో ఉన్న సమస్యలపై చర్చ సందర్భంగా బీడీ కార్మికుల దుస్థితిపై వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మంజురు చేసే నిధులు సరిపోవడం లేదని.. వారికి వేతనాలు పెంచాలని కతీర్ ఆనంద్ డిమాండ్ చేశారు. ఇక బీడీ కార్మికులు దుమ్ము, ఇతర వృత్తిపరమైన ప్రమాదాలకు గురికావడాన్ని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ క్రమంలోనే బడ్జెట్ కేటాయింపుల్లో బీడీ కార్మికుల దుస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు. అలాగే 60 ఏళ్లు పైబడిన కార్మికులకు పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇక మరో ఎంపీ, కన్యాకుమారి నుంచి ఎన్నికైన విజయ్ వసంత్.. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ప్రస్తావించారు. అన్ని వైద్య ఖర్చులు కవర్ చేసేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తిరిగి సమీక్షించాలని విజయ్ వసంత్ కోరారు. మరోవైపు.. ఐసీడీఎస్ పథకంలో అవినీతి చోటుచేసుకుంటోందని.. నకిలీ లబ్దిదారులపై చర్యలు తీసుకోవాలని బఠిండా ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.