పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో దద్దరిల్లిపోతున్నాయి. సభ్యులు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు.. వాటిని తిప్పికొట్టేందుకు చేసే వ్యాఖ్యలతో ఉభయ సభల్లో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్, ఎంపీ జయా బచ్చన్ మధ్య కొద్దిసేపు తీవ్ర మాటలు కొనసాగాయి. మహిళల హక్కులపై, ఇతర అంశాలపై రాజ్యసభలో గట్టిగా నిలదీసే జయా బచ్చన్‌ను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పిలిచిన విధానమే ఇప్పుడు వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణం అయింది.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్.. రాజ్యసభలో రేకెత్తించిన అంశం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. రాజ్యసభ సమావేశాల సందర్భంగా మాట్లాడేందుకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సోమవారం జయా బచ్చన్‌ను పిలిచారు. ఈ సందర్భంగా ఆయన జయా అమితాబ్ బచ్చన్ అని సంభోదించారు. దీనిపై జయా బచ్చన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని.. జయా అమితాబ్ బచ్చన్ అని పిలవాల్సిన అవసరం లేదని ఆమె కౌంటర్ ఇచ్చారు.
తనను జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జయా బచ్చన్ అని పిలవాలని సూచించారు. దీంతో జయా బచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్.. తన వద్ద పూర్తి పేరు రాసి ఉన్నందునే తాను జయా అమితాబ్ బచ్చన్ అని పిలవాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె మరింత ఫైర్ అయ్యారు. మహిళలను భర్త పేరుతో మాత్రమే గుర్తిస్తారా.. వారికి సొంతంగా ఉనికి లేదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా సొంతంగా విజయాలు సాధించట్లేదా అని జయా బచ్చన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో చాలాకాలం పాటు హీరోయిన్‌గా సినిమాలు చేసిన జయా బచ్చన్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సమాజ్ వాదీ పార్టీ నుంచి వరుసగా 5 సార్లు రాజ్యసభ సభ్యురాలిగా జయా బచ్చన్ ఎన్నికయ్యారు. మహిళల హక్కులపై పార్లమెంట్‌లో నిరంతరం జయా బచ్చన్ తన గళం వినిపిస్తుంటారు. ఈ క్రమంలోనే తనను తన భర్త పేరుతో కలిపి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సంబోధించడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.