ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వివిధ రంగాల మీద ఇప్పటికి ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆ శ్వేతపత్రాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని చెబుతోంది. ఏపీని అన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసింది అని టీడీపీ కూటమి అంటోంది.మొత్తం వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయని ఆయన చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే విభజన కంటే కూడా అతి పెద్ద నష్టాన్ని జగన్ ప్రభుత్వం కలుగచేసిందని ఆయన నిండు సభలోనే చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటేనే ఈ ఆర్ధిక దుస్థితి తలచుకుని భయం వేస్తోంది అని కూడా బాబు అన్నారు.సూపర్ సిక్స్ పధకాలను ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోతున్నామని కూడా ఈ విధంగా చెప్పుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. గతంలో ఇదే తరహాలో టీడీపీ ప్రజల వద్దకు వెళ్లి సక్సెస్ అయింది. బలమైన మీడియా కూడా నాడు సహకరించింది.ఇపుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో కేవలం 9 లక్షల 70 వేల కోట్లు మాత్రమే ఏపీ అప్పు ఉందని చెప్పారు. అంటే గతంలో చెప్పిన దాని కంటే మూడున్నర లక్షల కోట్ల అప్పు తగ్గినట్లే కదా అని అంటున్నారు. పైగా అప్పులతో తమకు సంబంధం ఏమిటి అని ప్రజలు కూడా ఆలోచించవచ్చు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అవసరం అయితే కేంద్ర సాయం తీసుకోవాలని వారు కోరవచ్చు అని అంటున్నారు.