తిరుపతి జిల్లా లీగల్‌సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీని సస్పెండ్ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల కాల్చివేత కేసులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఆర్డీవోలు సహా ఒక సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.వీరిలో మదనపల్లి ఆర్డీవోగా పనిచేస్తూ తిరుపతికి ఫిబ్రవరి మాసంలో బదిలీపై వచ్చిన మురళి ఒకరు. సుమారు పది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను కొంతమంది దగ్ధం చేసిన విషయం తెలిసిందే. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో భారీఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడం... అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించడం..వీటిలో మురళీకి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ వేటు పడింది. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మురళి అత్యంత సన్నిహితుడు.ఒంగోలులో పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మదనపల్లెలో పని చేస్తుండగా సస్పెండ్ చేయడంతో పాటు తహసీల్దారుగా రివర్షన్ సైతం ఇచ్చారు.పెద్దిరెడ్డి జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు రివర్షన్ కూడా ఉపసంహరించుకున్నారు. ఆరు నెలల క్రితం మురళి తిరుపతికి లీగల్‌సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు.