2014లో కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జింకల పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తరువాత ఏడాది ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల పరిధిలోని దేవరగట్టు ప్రాంతంలో జింకల పార్కు ఏర్పాటుకు 250 ఎకరాల భూమిని సర్వే చేశారు. దీని కోసం గతంలో రూ.53.26 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అటవీశాఖ అధికారులు తుంగభద్ర రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని 35, 36, 37 బీట్ కంపార్ట్‌మెంట్‌లో 12 అడుగుల ఎత్తులో కంచె వేయాలని నిర్ణయించారు. దీని కోసం రూ.29.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేశారు. అలా కాకుండా పార్కు ఏర్పాటు చేస్తే రూ.14.72 కోట్లు అవుతుందని, ఐదేళ్లపాటు జింకల నిర్వహణకు రూ.29.65 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జింకల పార్కుపై దృష్టి సారించలేదు. అప్పటి కార్మికశాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం కూడా పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా అచరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడైనా జింకల పార్కు ఏర్పాటు చేస్తారా? అని రైతులు వేచి చూస్తున్నారు.