ఏపీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో.. పార్టీలన్నీ సీరియస్‌గా ఫోకస్ పెట్టాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీలు బలమైన అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. -తెలుగు దేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాబ్జీ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు.. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి కేటాయించారు. అక్కడి నుంచి వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి వంశీకృష్ణపై అనర్హత వేటు వేయడంతోనే ఉప ఎన్నిక జరుగుతుంది. గంగా బాబ్జీ పేరు దాదాపుగా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇటు వైఎస్సార్‌సీపీ నుంచి తెరపైకి పలు పేర్లు వచ్చాయి.. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరి పేరు ఫైనల్ చేస్తారని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బలాబలాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్‌సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీకి బలం కనిపిస్తున్నా.. ఆ పార్టీకి కొత్త భయం మొదలైంది. అధికార పార్టీకి స్థానిక సంస్థల ప్రతినిధులు జైకొడతారనే టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వలసలపై ఫోకస్ పెట్టిన్లు తెలుస్తోంది.. ఇప్పటికే జీవీఎంసీలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే.
విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికతో రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి స్పష్టంగా బలం ఉంది.. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు కూటమి వైపు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ సీటు గెలుచుకోవాలని టీడీపీ, వైఎస్సార్‌సీపీలు పట్టుదలతో ఉన్నాయి. నెల రోజుల పాటూ విశాఖపట్నం రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయని చెప్పాలి.