ఆంధ్రప్రదేశ్‌లో రేణిగుంట- సీఆర్‌ఎస్ మధ్య వినాయకనగర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు నిర్మాణ పనులు మొదలయ్యాయి. తిరుపతి- రేణిగుంట రైల్వేస్టేషన్ల మధ్య వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల సంఖ్య పెరుగుతోంది.. అందుబాటులో ఉన్న రెండు రైలు మార్గాలు కూడా సరిపోవడం లేదు. అలాగే మరమ్మతులు చేయడానికి రైలు పెట్టెలను సీఆర్‌ఎస్‌కు తీసుకెళ్లడానికి.. అక్కడి నుంచి తిరిగి తీసుకురావడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ కారణాలతో పలు రైళ్ల రాకపోకలకు ఆలస్యం జరుగుతోందని రైల్వే అధికారులు గుర్తించారు. అలాగే రేణిగుంట సీబీఐడీ కాలనీ దగ్గర గూడ్స్‌షెడ్ యార్డ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పనుల కోసం రూ.25 కోట్లు నిధులు మంజూరు చేయడంతో.. కాంట్రాక్టర్లు పనులను మొదలు పెట్టారు. మంగళవారం వినాయకనగర్ సమీపంలో అడ్డుగా ఉన్న రైలు పట్టాలను తొలగించారు.. మిగిలన పనుల్ని వేగవంతం చేయనున్నారు. ఈ ప్రత్యేక రైలుమార్గం పూర్తైతే తిరుపతి - రేణిగుంట రైల్వేస్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండాపోతుంది అంటున్నారు. ప్రధానంగా రైళ్లు ఆలస్య కావు అంటున్నారు.
మరోవైపు తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. విజయవాడ డివిజన్‌లో మూడో లైన్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, కడప మధ్య ప్రయాణించే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును 6 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్నం నుంచి కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488 ) రైలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు రద్దు చేశారు. కడప నుంచి విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487) రైలు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు అధికారులు.
తిరుమల ఎక్స్‌ప్రెస్‌తో పాటూ మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించారు. విశాఖపట్నం - ఢిల్లీ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆగవని అధికారులు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం - లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం-సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం-గాంధీధామ్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆగవు.