ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. ఈ సమీక్ష ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి టీజీ భరత్.. కీలక విషయాలను వెల్లడించారు. ఏపీకి మరో భారీ పరిశ్రమ రానున్నట్లు తెలిపారు. రూ.75 వేల కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ రాబోతోందని ఆయన పేర్కొన్నారు. బీపీసీఎల్ కంపెనీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడే అన్ని విషయాలు వెల్లడించలేమని.. చెబితే పక్కనే ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రాలు.. ఆ కంపెనీలను వల వేసి తరలించుకుపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. కంపెనీలు ఇష్టముంటే వస్తారు, పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనే పాలసీని పాటించేవారిని.. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తోందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ ఫాస్ట్ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ కూడా ఆసక్తి కనబరిచారని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.
దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకురావాలని.. పరిశ్రమ శాఖలపై తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ ఎంఎస్ఎంఈ, క్లస్టర్ విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీబీఎన్ బ్రాండ్‌తో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 4 ఇండస్ట్రీయల్ క్లస్టర్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్ వెల్లడించారు. ఇప్పటికే కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, ఓర్వకల్లు, కొప్పర్తిలో 4 ఇండస్ట్రీయల్ క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. కొత్తగా కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో కొత్తగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
ఇక చిత్తూరు నోడ్ కింద రూ.1350 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. రాజధాని అమరావతి సమీపంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి కల్పించారని విమర్శలు చేశారు. గతంలో పారిశ్రామికవేత్తలను షేర్లు, పర్సంటేజీలు అడిగే పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు అదేం లేదని తెలిపారు.