మాజీ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేయడంతో.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన న్యాయ విద్యార్థికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాయం అందించారు. గుంటూరు జిల్లా పెసర్లంకకు చెందిన సాయిఫణీంద్ర న్యాయ విద్యను అభ్యసించి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన తెనాలి వెళ్లి వస్తుండగా.. ఈ నెల 5న కొల్లూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఫణీంద్ర వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పగా.. కుటుంబ ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగానే ఉంది.
ఫణీంద్ర కుటుంబసభ్యులు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతిని కలిసి తమ పరిస్థితిని వివరించారు. ఆమె వెంటనే స్పందించి గత వారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సాయిఫణీంద్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించాలని రిక్వెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేయడంతో.. వెంటనే రూ.10 లక్షలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారులు ఫైల్ సిద్ధం చేయగా.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 లక్షల చెక్ సిద్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే భారతి ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసి చెక్ తీసుకున్నారు.
సమస్య చెప్పగానే స్పందించి సాయం అందించిన చంద్రబాబుకు భారతి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చాలా ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటోందన్నారు. అయినా సరే సమస్య గురించి చెప్పి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు.. రూ.10 లక్షల సాయాన్ని అందజేసి బాధితుడికి పునర్జన్మ ఇచ్చారని ప్రశంసించారు. రోడ్డు ప్రమాదంతో తన బిడ్డ కోమాలోకి వెళ్లాడని.. 9 రోజులు స్పృహలోనే లేడని ఫణీంద్ర తండ్రి వెంకటేశ్వరరావు తెలిపారు. తన కుమారుడి వైద్యానికి సాయం అందజేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తుమ్మల మధుస్మిత రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఉద్యోగం చేస్తున్న మధుస్మిత మంగళవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని కలిసి చెక్ అందజేశారు. మధుస్మితను చంద్రబాబు అభినందించారు.. ఎన్ఆర్ఐలు అమరావతి కోసం ఇలా ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో నోబెల్ పురస్కార గ్రహీత, యూనివర్సిటీ ఆఫ్ షికాగో ప్రొఫెసర్ మైఖేల్‌క్రీమర్ సమావేశం అయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి సరఫరా రంగాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేయడానికి క్రీమర్ అనుభవాన్ని వినియోగించుకుంటామన్నారు చంద్రబాబు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా 500 గ్రామాల్లో క్లోరినేషన్ చేసిన నీరు సరఫరా చేయడానికి ఎవిడెన్స్ యాక్షన్ సంస్థ భాగస్వామ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఏపీలో పాల్ (పర్సనలైజ్‌డ్ అడాప్టివ్ లెర్నింగ్ ) కార్యక్రమం అమలు తీరు మిగతా రాష్ట్రాల్లోకంటే బావుందన్నారు మైఖేల్‌క్రీమర్.