కేరళలో వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 250 దాటింది. ఇంకా చాలా మంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మరి కొంతమంది ఆచూకీ గల్లంతైంది. ఒక్క వయనాడ్ మాత్రమే కాకుండా కేరళ వ్యాప్తంగా భారీగా వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు, కొండ ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇక తాజాగా ఓ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో.. ఆమె భర్త.. ప్రాణాలకు తెగించి మరీ వరద నీటితో ఉప్పొంగుతున్న బ్రిడ్జిని దాటించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇడుక్కి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం కేరళలో ఉన్న పరిస్థితిని తెలియజేస్తోంది. స్థానికంగా ఉన్న ఓ గర్భిణీకి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. తమ గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లాలంటే అక్కడ ఉండే బ్రిడ్జి దాటాల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా ఇడుక్కి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ బ్రిడ్జి కింది నుంచే కాకుండా వరద ప్రవాహం దాని పైకి చేరింది. దీంతో ఆ బ్రిడ్జి దాటడం స్థానికులకు తీవ్ర కష్ట తరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి వెళ్లాలంటే ఎలాగైనా ఆ బ్రిడ్జి దాటడమే శరణ్యం కావడంతో ఆ గర్భిణీ భర్త సాహసం చేశాడు. కారులో ఆ గర్భిణీని ఎక్కించుకుని.. ఆ బ్రిడ్జిని వేగంగా దాటాడు. ఓ వైపు బ్రిడ్జిపై వరద ప్రవాహం వేగంగా దూసుకెళ్తున్నా.. ఏ మాత్రం బెదరకుండా తన మారుతి ఆల్టో కారును పోనిచ్చాడు. చివరికి విజయవంతంగా ఆ బ్రిడ్జిని దాటించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ భర్త చేసిన పనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.