దేశీయ దిగ్గజ టెక్ కంపెనీ, టాటా గ్రూప్ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నార్త్ అమెరికాలోని ప్రముఖ కాలేజీ స్టోర్ ఆపరేటర్ ఫోలెట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థతో మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఫోలెట్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు గానూ ఈ డీల్ కుదుర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. టీసీఎస్ కాగ్నిక్స్, క్లౌడ్ ఎక్స్ పోనెన్స్ వంటి ట్రేడ్ మార్క్ ప్లాట్ ఫామ్స్, సొల్యూషన్స్ ద్వారా అమెరికా, కెనడాలోని కళాశాలలు, యూనివర్సిటీల కోసం ఫోలెట్ అకడమిక్, రిటైల్ సేవలను పెంపొందించేందుకు టీసీఎస్ మెరుగైన ఐటీ మౌలిక సదుపాయాలను కల్పించనుంది.
కళాశాల స్టోర్ ఆపరేటర్ ఫోలెట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ నార్త్ అమెరికా వ్యాప్తంగా 1000 కిపైగా కాలేజీ స్టోర్స్ నడుపుతోంది. విద్యార్థుల అకడమిక్ జర్నీకి మద్దతుగా వివిధ రకాల సేవలు అందిస్తోంది. వారికి కోర్స్ మెటీరియల్, టెక్నాలజీ, విద్యార్థులు విజయవంతంమయ్యేందుకు అవసరమైన కాలేజీలకు చెందిన బ్రాండెడ్ మెటీరియల్స్ వంటివి అందిస్తోంది. ఈ మేరకు ఈ డీల్ గురించి బీఎస్ఈ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో టీసీఎస్ వెల్లడించింది.
ఈ డీల్‌లో భాగంగా టీసీఎస్ దాని సిగ్నేచర్ మెషిన్ ఫస్ట్ డెలివరీ విధానాన్ని అవలంభించనుంది. దీంతో ఫోలెట్ టెక్నాలజీ కార్యకలాపాలను బలోపేతం చేయనుంది. టీసీఎస్ కాగ్నిక్స్ వంటి యాజమాన్య యాక్సిలరేటర్లు, ముందుగా నిర్మించిన క్లౌడ్ ఆధారిత మాడ్యూళ్లను అందించే ఏఐ టెక్నాలజీలను అందించనుంది. ఇది కంపెనీకి సంబంధించిన మాన్యువల్ ప్రక్రియలను ఆటోమేట్ చేస్తుందని టీసీఎస్ తెలిపింది. అలాగే అంతర్నిర్మిత భద్రత, రెగ్యులేటరీ సమ్మతితో కూడిన ఎంటర్ ప్రైజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ ఫ్లాట్ ఫారమ్స్ అందిస్తుంది. ఇవి వ్యాపార కార్యకలాపాలను ప్రభావితం చేసే సమస్యలను అంచనా వేయడం, సలహాలు సూచించడం, సమస్యల పరిష్కారం వంటివి అందిస్తాయి. టీసీఎస్‌కు చెందిన క్లౌడ్ ఎక్స్ పోనెన్స్ ప్లాట్ ఫామ్ హ్రైబ్రిడ్ క్లౌడ్ ఎన్విరాన్‌మెంట్లలో సేవల నిర్వహణకు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ఎక్కువగా ప్రభావితమైంది ఐటీ కంపెనీలే. 2020 తర్వాత లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికీ ఏదో ఒక కంపెనీ ఉద్యోగాల కోతలు ప్రకటిస్తూనే ఉంది. సరైన ప్రాజెక్టులు లేకా, ఆదాయం రాక వ్యయ నియంత్రణల పేరుతో ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు చేసుకోవడం ఐటీ ఉద్యోగులకు శుభవార్తగానే చెప్పాలి. కొత్త ప్రాజెక్టులు వస్తే మరింత మంది ఉద్యోగులు అవసరమవుతారు తప్పా పాత వారిని తొలగించే అవసరం ఏర్పడకపోవచ్చని ఐటీ నిపుణులు చెబుతున్నారు.