కూటమి ప్రభుత్వం గత 50 రోజుల్లో తీసుకుంటున్న అనేక నిర్ణయాలను చూస్తే.. ముఖ్యంగా విద్యా రంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తమ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారేలా, సంస్కరణలు తీసుకొస్తే వాటిని నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఆయన ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి పిల్లలు, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోందని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పారని, వాటిలో కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే.. కూటమి పార్టీలు ముందు నుంచి కూడా అందుకు వ్యతిరేకంగానే ఉన్నాయన్న ఆయన, ఆనాడు కోర్టుల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడూ వారు అదే ధోరణిలో ఉన్నారని చెప్పారు. పేద విద్యార్థులు కూడా ఇంగ్లిష్ మీద పట్టు సాధించాలని, వారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్ నేర్చుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆలోచించిన వైయస్ జగన్‌గారు, టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయడం వల్ల.. గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు.