డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పదేపదే వాయిదా పడటంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. షెడ్యూలు ప్రకారం జూలై 10 లోపే దరఖాస్తుల గడువు ముగిసింది. అదే సమయంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జరిగింది. సమయం తక్కువ ఇవ్వడంతో మొదట 1.2లక్షల మంది విద్యార్థులే దరఖాస్తు చేసుకున్నారు. కానీ బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు రాకపోవడం, కాలేజీలకు అనుమతుల్లో జాప్యంతో అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా వేశారు. తర్వాత ఫీజుల విషయంలో జాప్యంతో గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నారు. ఇలా ఎక్కువ సమయం రావడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకూ 1,62,750 మంది డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా రాష్ట్రంలో 3.5 లక్షలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీసీఏ కోర్సుకు డిమాండ్ పెరగడంతో కొన్ని కాలేజీలు దాన్ని అవకాశంగా తీసుకొని అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలో ఖరారు చేసిన ఫీజుకు గరిష్ఠంగా మూడు రెట్లు తీసుకోవచ్చు. దీంతో కొన్ని కాలేజీలు గరిష్ఠ ఫీజును వసూలు చేస్తున్నాయి.