తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇలా వెంకన్న దర్శనానికి భక్తులు తరలివస్తుంటారు. అయితే ఇలా వచ్చే భక్తులు.. తిరుమలలో సేవల గురించి, దర్శనం తీరు గురించి తెలియక తికమకపడుతుంటారు. ఇక ఎవరినైనా అడుగుతామని అనుకుంటే భాషతో ఇబ్బంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది. డయల్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు ఈ విషయాలను వెల్లడించారు. ఇక నుంచి తిరుమలలో ఐదు భాషలలో ప్రకటనలు చేయనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.
మరోవైపు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులు సమయపాలన పాటించాలని ఈవో కోరారు. ఎస్‌ఈడీ టికెట్స్, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే దర్శనానికి రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది భక్తులు తమ ఎస్‌ఎస్‌డి టోకెన్‌లు, ఎస్‌ఇడి టికెట్లపై కేటాయించిన సమయం కంటే ముందుగానే దర్శనానికి రావడంతో.. గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. ఈ క్రమంలోనే తమకు కేటాయించిన సమయానికే భక్తులు దర్శనానికి రావాలని టీటీడీ ఈవో శ్యామలరావు కోరారు. భక్తులు క్యూలైన్ల వెలుపల వేచి ఉండకుండా, స్థానిక ఆలయాలను, దర్శనీయ ప్రాంతాలను సందర్శించాలని సూచించారు.
మరోవైపు టీటీడీ గత కొన్ని రోజులుగా టోకెన్లు, టికెట్లపై పేర్కొన్న సమయానికే.. భక్తులను దర్శనానికి అనుమతిస్తూ వస్తోంది. ఇక తిరుమలలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తిరుమల సమాచారాన్ని ఐదు భాషల్లో తెలియజేస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్లం భాషల్లో ప్రకటనలు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం నుంచి తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్‌లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా తిరుమల సమాచారంపై ప్రకటనలు ఇస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు.