శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు.. టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు అందరి సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు ఈవో జే శ్యామలరావు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సెప్టెంబరు చివరి నాటికి బ్రహ్మోత్సవాల పనులను పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.
ఇటీవల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు శ్యామలరావు. తిరుమల శ్రీవారి శ్రీవాణి దర్శనం టికెట్లు ఆఫ్‌లైన్‌లో రోజుకు 1000 జారీ చేస్తామన్నారు. జూలై 22 నుంచి ఆఫ్ లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించామన్నారు. సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో జారీ చేస్తున్నామని గుర్తు చేశారు.
టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్‌ఎస్‌డి టోకెన్లను.. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నామని గుర్తు చేశారు. వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని.. ఎస్ఎస్‌డి టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి దర్శనానికి రావాలని కోరారు. భక్తులు ఈ మార్పులు, చేర్పులు గమనించి తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు సూచించారు.
తిరుమలలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈవో. అలాగే తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడిసరుకులను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుమల క్యూలైన్లల్లో, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా కొందరు ఆధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో ఆరు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి మోసాలు చేస్తున్న దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు శ్యామలరావు. తిరుమలలో భక్తులకు సరసమైన ధరలతో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. శ్రీవారి భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని.. టీటీడి నిబంధనలు పాటించని హోటళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కోనుగొలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు టీటీడీ ఈవో.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయని.. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో తెలిపారు. ఏడాది పొడవునా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని.. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణిని ఆగస్టు 1 నుంచి మూసివేసినట్లు తెలిపారు. నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదన్నారు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటు చేశామని.. భక్తులు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa