ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 5 ఏళ్లలో సేవల రంగం మరింత అభివృద్ధికి వివిధ శాఖలకు చెందిన అధికారులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పర్యాటక రంగంలోనే అధిక ఉపాధి అవకాశాలతో పాటు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. సచివాలయంలోని సీఎస్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన 3వ సర్వీస్ సెక్టార్ టాస్క్ ఫోర్స్ సమావేశం మంగళవారం జరిగింది. సర్వీసు రంగంలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర ప్లానింగ్ డిపార్టుమెంట్ సెక్రటరీ సంజయ్ గుప్తా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ అనిల్ చంద్ర పునేఠకు వివరించారు. గత నాలుగేళ్ల నుంచి సర్వీసు రంగంలో ఏపీ స్థూల విలువ జోడింపు(జీవీఏ-గ్రాస్ వాల్యూ ఏడెడ్) నిలకడగా అభివృద్ధి సాధిస్తోందన్నారు, 2017-18లో వివిధ శాఖలతో కలిపి జీవీఏ 9.11 శాతం మేర అభివృద్ధి సాధించిందన్నారు. ఏపీలో 7,177 బ్యాంకులున్నాయని, 7,11,175 మందికి ఒక్కో బ్యాంకు ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో 6.21 లక్షల మందికి ఒక బ్యాంకు ఉందని, ఏపీలో మరో 1000 వెయ్యి బ్యాంకుల అవసరముందని సీఎస్ కు రాష్ట్ర ప్లానింగ్ డిపార్టుమెంట్ సెక్రటరీ సంజయ్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 55 లక్షల విమాన ప్రయాణికులు దేశ, విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఎయిర్ పోర్టు స్థాపనతో పాటు ఉన్నవాటిని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు. ఇటీవలే కర్నూల్ ఎయిర్ పోర్టును సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారన్నారు. త్వరలో ప్రయాణికుల రాకపోకలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దగదర్తి అంతర్జాయ విమానాశ్రయం, కుప్పం ఎయిర్ పోర్టులకు సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని, త్వరలోనే వాటి పనులు ప్రారంభించి, వినియోగంలోకి తీసుకొస్తామని వివరించారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ, అంతరాష్ట్ర విమాన సర్వీసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. విజయవాడ-దుబాయ్ అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభానికి తీసుకున్న చర్యలను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. దీనివల్ల దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు రాకపోకలు సాగిస్తుంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని విమాన సర్వీసులు పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం, కాకినాడలో శిల్పారామాలు త్వరలో ప్రారంభం కానున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గుంటూరులో ఏర్పాటు కాబోతున్న శిల్పారామం ఈ ఏడాది మార్చి నాటికి సిద్ధం చేస్తామన్నారు. శ్రీకాకుళం, కర్నూల్ లో శిల్పారామాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. చిత్తూరులో శిల్పారామం ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు లో భూములు కేటాయించాలని తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మెగా శిల్పారామం ఏర్పాటుకు భూమి కేటాయించాలని సీఆర్డీయేను కోరామన్నారు. రాష్ట్రంలో 37 బీచ్ లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. త్వరలో ప్రత్యేక వాటర్ స్పోర్ట్సు పాలసీ తీసుకురానున్నట్లు ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనిపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ స్పందిస్తూ, పర్యాటక శాఖను అభివృద్ధి చేయడం ద్వారా ఒక వైపు ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. అటవీ, హెలీ, టెంపుల్, ఎకో, రూరల్ టూరిజాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తరలొస్తున్న నేపథ్యంలో పర్యాటకుల తాకిడి కూడా రానురానూ పెరుగుతోందన్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ మాదిరిగా రాష్ట్రంలో విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో అటువంటి ఫెస్టివల్స్ నిర్వహించాలన్నారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సర్వీసు సెక్టార్ లో ఉన్న అన్ని శాఖల అధికారులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. పర్యాటకంతో పాటు పరిశ్రమలు, మౌలిక సదుపాయల కల్పన, రవాణా శాఖలో ఉపాధి అవకాశాలు మెండు లభిస్తాయన్నారు. వాటి అభివృద్ధిపైనా దృష్టి సారించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీఎఫ్ డీసీ, ఐటీ, కమర్షియల్ ట్యాక్స్, ప్లానింగ్ డిపార్టుమెంట్లలో సేవల రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, ముఖ్య కార్యదర్శులు అజయ్ జైన్, ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa