అల్లూరి జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం తీముల బంధగ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కార్తీక్ (13) కుక్క కాటుతో మృతి చెందాడు. మూడు నెలల క్రిందట కార్తీక్ కుక్క కాటుకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం చింతపల్లి ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు.. గత మూడు నెలలుగా చింతపల్లి హాస్పిటల్లోనే కార్తీక్ చికిత్స పొందుతున్నాడు. అయితే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న విశాఖపట్నం కేజీహెచ్‌లో బంధువులు బాలుడుని చేర్పించారు. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు మూడు నెలల క్రితం కుక్క కరవడంతో వ్యాక్సిన్ వేయించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందని తెలిపారు. అప్పటికే కార్తీక్ ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో చివరి క్షణాలు తమ గ్రామంలో ఉండాలని తల్లిదండ్రులు భావించారు. ఇంటికి వెళ్లేందుకు కార్తీక్, తల్లిదండ్రులతో కలిసి విశాఖ నుంచి అరకు బస్సు ఎక్కాడు. అయితే మార్గమధ్యలోనే కార్తీక్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మృతి చెందాడు. బిడ్డ చనిపోయాడని గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.