దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను మార్చినాటికి అమలుచేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సిగ్నల్ వ్యవస్థను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి పరిశీలించి టెస్ట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బేస్ బ్యాండ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఎక్కువ ధరలతో ఫోన్ రీఛార్జ్‌లు చెల్లించి ఫోన్ సర్వీసులు ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. రీఛార్జ్ ధరలు పెరగటం వల్ల ప్రజలు ఇబ్బందిపడే పరిస్ధితిని మార్చాలనే ఉద్దేశంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ను 4జీ సేవలతో ఆధునీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలలుగన్న విధంగా ప్రజలకు ఉన్నతమైన ఫోన్ సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారరు. ఏపీలో క్వాలిటీతో కూడిన 4జీ సేవలను అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అతితక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలను ప్రజలు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతోనే కేంద్రం 4జీ టవర్లను సిద్ధం చేస్తుందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ రాబర్ట్ జే.రవి మాట్లాడుతూ ఏపీలో 300 లొకేషన్లను రెడీ చేసుకొని టెస్టులు చేస్తున్నామని తెలిపారు. 400 సెంటర్ల్‌లో టవర్స్‌కు ఎక్విప్మెంట్‌ను ఇన్‌స్టాల్ చేసి 4జీ సేవలు అందించటానికి సిద్ధం అవుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తలశిల ప్రసన్నకుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది పాల్గొన్నారు.