ఇంటింటా సోలార్ వెలుగులు ప్రజ్వరిల్లనున్నాయి. నిరంతరాయంగా విద్యుత్ కాంతులు వెదజల్లడంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజనకు శ్రీకారం చుట్టింది. భవనం పై భాగంలో సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేసుకుని సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వినియోగించుకోవటంతో పాటు అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు తరలించి విక్రయించుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ సోలార్ విద్యుత్ వినియోగంలో నిరంతర విద్యుత్‌తో పాటు విద్యుత్ అంతరాయాలు, లోఓల్టేజి, విద్యుత్ బిల్లుల సమస్యలకు చెక్ పెట్టేలా ఈ పథకాన్ని రూపొందించారు. పెట్టుబడి సులభంగా తిరిగి రావడంతో పాటు రూఫ్‌టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ అందించడంతో ఈ పథకానికి అనూహ్య స్పందన వస్తోందని చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు ఈ ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు , రైల్వే స్టేషన్లు, రైల్వేగేట్లు, డివైడర్లు, ఆపార్ట్‌మెంట్లు వద్ద సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఈ పథకంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష సాలార్ కనెక్షన్లు ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. విద్యుత్ అధికారుల ఆమోదంతో ఆయా గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. భవనం పైభాగంలో వంద చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానెల్‌ను అమర్చుతారు. ప్రస్తుతం వినియోగించే విద్యుత్ మీటర్ స్థానంలో నెట్ మీటర్ ఏర్పాటు చేసి దీనిద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగాన్ని లెక్కిస్తారు. విద్యుత్ వినియోగానికి మించి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌ను అనుసంధానం చేస్తారు. ఆ విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. వినియోగదారులు ఉత్పత్తి చేసే అదనపు విద్యుత్‌కు ఆదాయాన్ని విద్యుత్ శాఖ సమకూర్చుతుంది. సబ్సిడీ, బ్యాంకు రుణంతో పాటు పెట్టుబడి 6, 7 సంవత్సరాల్లో తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. సూర్యఘర్ ప్యానెల్స్ ఏర్పాటు చేసిన 30 రోజుల్లో వినియోగ దారుల ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తారు. ముందుగా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 100 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కిలోవాట్ రూఫ్‌టాప్ కెపాసిటీ విద్యుత్ ఉత్పత్తికి 3 నుంచి 4 ప్యానెల్స్ ఉపయోగిస్తారు.ఈ పథకాన్ని పొందాలంటే గృహ విద్యుత్ వినియోగదారులు తమ వినియోగం 300 యూనిట్లు లోపు ఉండాలి. ఈ పథకం కోసం మొబైల్‌లో సూర్యఘర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులో వినియోగదారుని వివరాలు నమోదు చేయాలి. ఆరు నెలల విద్యుత్ బిల్లులు కాపీలను జతచేసి ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ రుసుం కిలోవాట్ ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ట్రాన్స్‌కో అనుమతులు పొందిన తర్వాత వెండర్లను ఎంపిక చేసుకోవాలి. కిలోవాట్స్‌ను బట్టి సబ్సిడీ మంజూరు చేస్తారు. మిగి లిన సొమ్ము మొత్తానికి బ్యాకు రుణ సదుపాయం కల్పిస్తారు. వినియోగ దారులు వాయిదాల పద్ధతిలో రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుంది. సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు కోసం విద్యుత్ సమస్యల పరిష్కా రం కోసం టోల్‌ఫ్రీ నెంబరు 1912 ను సంప్రదించవచ్చు.