విద్యాశాఖ మీద సమీక్షించిన సీఎం చంద్రబాబు.. పాఠశాలల్లో తిరిగి విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ సంఖ్యను జీరోకు తేవాలన్న చంద్రబాబు.. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే విద్యార్థులకు కిట్ల పంపిణీలో రెండు, మూడు నెలలు ఆలస్యమైందన్న చంద్రబాబు.. సకాలంలో పంపిణీ చేయని సంబంధిత ఏజెన్సీని పక్కనబెట్టాలని ఆదేశించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు.
ఇక ఏపీ విద్యావ్యవస్థ అత్యుత్తమం అనేలా విధానాలు రూపొందించాలన్న చంద్రబాబు.. అధికారులు కూడా ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఆరేళ్ల వయసు ఉన్న పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని.. అంతకంటే తక్కువ వయసు ఉంటే అంగన్వాడీలో చేరేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం హయంలో పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలు లేవన్న చంద్రబాబు.. ఒత్తిడి లేని విద్యను వారికి అందించాలని.. అందుకోసం మళ్లీ విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలు పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.
ఇక ఎన్నికల సమయంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామన్న చంద్రబాబు నాయుడు.. వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని.. వీటి ద్వారా 5 నుంచి 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. వర్చువల్ వర్కింగ్ పాలసీ రూపకల్పన కోసం త్వరలోనే వర్క్ షాప్ పెడదామన్న చంద్రబాబు .. ఏపీని వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాగే గ్రామ సచివాలయాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల వివరాలు సేకరించాలని.. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారనే సమాచారం సేకరించాలని సూచించారు.
మరోవైపు ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్ ఫామ్‌ను.. యూపీఐ మాదిరిగా తీసుకురావాలన్న ఏపీ సీఎం చంద్రబాబు.. అలా చేస్తే ఉత్పత్తిదారులు వినియోగదారులు ఒకే వేదికపై ఉంటారన్నారు. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు, చేతివృత్తుల వారికి తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.