ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు శుభవార్త చెప్పారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరగా ఆదుకుంటామని ప్రకటించారు. ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతేకాదు ఇటీవల అధిక వర్షాలకు వరినారు, నారుమళ్లు నష్టపోయిన రైతులకు 80శాతం రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇటీవల వానల దెబ్బకు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1,406 హెక్టార్లలో నారుమళ్లు, 33వేల హెక్టార్లలో వరినారుమళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలా నారు, నారుమళ్లు నష్టపోయిన రైతుల కోసం 6,356 క్వింటాళ్ల వరి విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు. బాధిత రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ వరి విత్తనాలు పొందాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రుల బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర, జిల్లాల వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు చేసి.. ముందుగానే రైతుల అవసరాలకు తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనం ఛీకొట్టినా.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన బుద్ధి మార్చుకోలేదని మండిపడ్డారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తన ఐదేళ్ల పాలనలో అరాచకాలకు పాల్పడిన జగన్ .. నేడు ఏదో జరిగిపోతోందంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపై దాడులు జరగని రోజుందా?.. పల్నాడులో తెలుగు దేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతుకోసి చంపిందెవరు? అని ప్రశ్నించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లలో పెద్దఎత్తున దోపిడీకి పాల్పడింది ఎవరో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపితే మంచిదని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా జగన్ గెలవలేరన్నారు. త్వరలో వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని సెటైర్లు పేల్చారు.
మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండగా.. ఇటు నాగార్జున సాగర్ జలాశయం కూడా వరద నీటితో నిండుతోంది. ప్రకాశం జిల్లాలో సాగర్ ఆయకట్టు రైతులు వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని పలువురు రైతులు వరినారు మడులు పోశారు.. మిగిలిన రైతులు అందుబాటులో ఉన్న బోర్ల కింద, సోలార్ మోటార్ల కింద నారుమడులు పోస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కూడా పొలాల్లో వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు.