ఒక వాహనంతో సహా 22 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ పీలేరు డీఎఫ్‌వో జేవీ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి పీలేరు మీదుగా చెన్నైకు ఎర్రచందరం అక్రమ రవాణా జరగుతోందన్న సమాచారం మేరకు తాము ఆదివారం రాత్రి 9 గంటల నుంచి కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. సోమవారం ఉదయం 2.30 గంటల ప్రాంతంలో పీలేరువైపు వస్తున్న నెంబరు లేని టయోటా ఇతియోస్ కారు తాము ఆపినా ఆగకుండా వేగంగా వెళ్లిపోయిందన్నారు. తాము ఆ వాహనాన్ని వెంబడించగా బెంగళూరు-తిరుపతి రహదారిలోని చెర్లోపల్లె వద్ద కారును ఆపివేసి, డ్రైవర్, మరో వ్యక్తి చీకటిలో పారిపోయారన్నారు. కారును తనిఖీ చేయగా అందులో 349 కేజీలు బరువున్న 22 ఎర్రచందనం దుంగలు లభించాయన్నారు. దీంతో కారుతో సహా వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. పారిపోయిన వారి కోసం కూడా గాలింపు ముమ్మరం చేశామన్నారు. ఈ దాడిలో తనతోపాటు ఎఫ్‌ఆర్‌వో వెంకట రమణ, ఎఫ్‌బీవో ప్రతాప్, సిబ్బంది నాగేంద్ర బాబు, వెంకటేశ, మల్లికార్జున పాల్గొన్నట్లు ఆయన వివరించారు.