జగన్‌కు మాజీ ముఖ్యమంత్రి హోదాలో నిబంధనల ప్రకారమే భద్రత కల్పించామని.. ప్రస్తుతం ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు స్పష్టత ఇచ్చారు. తనకు భద్రత తగ్గించారని జగన్ చేస్తున్న వాదన నిజం కాదన్నారు. తన భద్రతపై హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయడంతో.. పోలీస్‌శాఖ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగిన సమయంలో ఆ హోదాలో ఉన్న అదనపు భద్రతను మాత్రమే తగ్గించినట్లు తెలిపారు.
ప్రస్తుతం జగన్ మాజీ సీఎం కాబట్టి.. ఆయనకు ముఖ్యమంత్రికి కల్పించే భద్రత ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. గతంలో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంత భద్రత కల్పించామో.. ఇప్పుడు జగన్‌కూ అంతే భద్రత కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జగన్‌కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్లు వివరాలను వెల్లడించారు. వీరిలో ఆయన ఇంటి దగ్గర 10 మంది ఆర్మ్డ్ గార్డ్స్ భద్రత ఉందని.. షిఫ్టునకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్‌వోలు 24 గంటల పాటు ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.
అలాగే మొత్తం 24 మంది సిబ్బందితో రెండు ఎస్కార్ట్ బృందాలు నిరంతరం జగన్ వెంట ఉన్నాయంటున్నారు. పగలూ, రాత్రి కలిపి మొత్తం ఐదుగురు వాచర్లు ఉన్నారని.. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని భద్రత కోసం ఇంఛార్జ్‌గా నియమించినట్లు తెలిపారు.మూడు షిఫ్టుల్లో పనిచేసేలా మొత్తం ఆరుగురు ఫ్రిష్కర్లు, స్క్రీనర్లు, నిరంతం అందుబాటులో ఉండేలా ఆరుగురు డ్రైవర్లను జగన్‌కు కేటాయించామని చెబుతోంది పోలీస్‌శాఖ. జగన్ భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. నిబంధనల మేరకు ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న భద్రతను కుదించిందంటూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు కేంద్ర హోంశాఖ జడ్ ప్లస్ భద్రత కల్పించిందని.. జూన్ 3 (ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు) తనకు ఏ విధమైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్రస్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2019లో తనపై కోడికత్తితో దాడి జరిగిందని.. సీఎం కాకముందే ఉన్నతస్థాయి భద్రత కల్పించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక 139 మందితో భద్రత కల్పించారని.. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో ఎలాంటి సమాచారం లేకుండా భద్రతను 59 మందికి కుదించినట్లు పేర్కొన్నారు. తనను కూటమి ప్రభుత్వం అంతమొందించాలని చూస్తోందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని జడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ పిటిషన్‌లో కోరారు. ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేయనుంది.