సాధారణంగా ఒకటి తేదీ వచ్చిందంటే వృద్ధులు పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నం.. తనకు పింఛన్ డబ్బులు వద్దంటోంది. అనకాపల్లి జిల్లాలో విచిత్రం జరిగింది.. ఓ వృద్ధురాలు రెండు నెలలుగా పింఛన్ తీసుకోవం లేదు. పింఛన్ డబ్బుల నాకొద్దు బాబోయ్ అంటూ సచివాలయ సిబ్బందిని పంపించేస్తోంది. ఆమె ఎందుకు ఇలా పింఛన్ డబ్బులు వద్దని చెబుతోందని ఆరా తీస్తే విచిత్రమైన కారణం తెలిసింది.
చోడవరం బుక్కా వీధిలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కోట్ల కాంతంకు వృద్దాప్య పింఛన్ వస్తోంది.. అయితే పింఛను డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లిన సచివాలయం సిబ్బందికి ఆరు రోజులుగా ముప్పు తిప్పలు పెడుతోంది. జూన్, జులై పింఛను డబ్బుల్ని కూడా ఆమె తీసుకోలేదు. జూన్ పింఛన్‌కు సంబంధించి వేలిముద్ర వేయకపోవడంతో డబ్బుల్ని సచివాలయ సిబ్బంది వెనక్కు పంపేశారు. జులై నెలకు సంబంధించిన పింఛను పంపిణీలో ఫేస్ యాప్‌లో నమోదు కావడంతో రూ.4 వేలు నగదు ఇస్తుంటే.. తనకు వద్దంటూ వెళ్లిపోతన్నారు.
కాంతం సచివాలయ సిబ్బందిని చూసి పారిపోతోంది.. దీంతో ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. సచివాలయ సిబ్బంది ఆమె ఫోటోలు తీస్తున్నారట.. అందుకే తన ఫొటోలు తీయొద్దు.. 'మీరిచ్చే డబ్బులొద్దని' ఆమె మొండికేస్తోంది. దీంతో వార్డు సచివాలయ సంక్షేమ సహాయకురాలు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కాంతం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆమె గతంలో గ్రామ వాలంటీర్లు ఇచ్చేప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని.. రెండు నెలలుగా పింఛను నగదు తీసుకోవడం లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆమె వరుసగా రెండో నెల కూడా పింఛన్ తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.