శ్రీకాకుళం జిల్లా పలాసలో స్థానిక గ్రామీణ నీటిపారుదల విభాగం పాత కార్యాలయంలో చోరీ కలకలంరేపింది. ఈ దొంగతనంలో పలు ఫైల్స్ చోరీకి గురైనట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ కార్యాలయం వెనుక ఉండే కిటికీ తొలగించిన దొంగలు.. లోపలికి చొరబడ్డారు. దస్త్రాలను మూటలు కట్టి తుక్కు షాపులో దొంగలు అమ్మేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా స్క్రాప్ షాప్‌లోని మూటలను గుర్తించారు. ఈ విషయం ఇంజినీరింగ్ అధికారులకు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి అధికారులు చెత్త దుకాణం వద్దకు వెళ్లి విక్రయించిన ఫైళ్ల మూటలను స్వాధీనం చేసుకుని.. ప్రధాన కార్యాలయానికి తరలించారు. అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఈ ఫైల్స్ చోరీ వ్యవహారంపై ఆర్‌డబ్ల్యుఎస్ జేఈ ప్రసన్నకుమార్ స్పందించారు.ఆ కార్యాలయం పాత భవనం కావడంతో పాతకాలం కవరింగ్ లెటర్లు, పాత ఫైళ్లను మాత్రమే ఉంచుతున్నట్లు తెలిపారు. అప్పుడప్పుడు ఆ కార్యాలయానికి వెళ్లి వస్తున్నామని.. పాత ఫైళ్ల మూటలను చెత్త షాపులో విక్రయించినట్టు సమాచారం తెలియడంతో పోలీసులతో కలిసి అక్కడకు వెళ్లి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మిగతా పాత ఫైళ్లను కార్యాలయం నుంచి ప్రధాన కార్యాలయానికి తరలించామన్నారు ప్రసన్నకుమార్.
మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఫైల్స్ వ్యవహారం కలకలంరేపింది. గుంటూరు పశ్చిమం తహసీల్దార్ కార్యాలయం దగ్గర చెత్తలో ప్రభుత్వ ఫైల్స్ కనిపించాయి. మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లేసరికి అక్కడి నుంచి మాయం అయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి అధికారులు, సిబ్బంది కార్యాలయంలోనే ఉన్నామని తహసీల్దార్ ఫణీంద్ర తెలిపారు. కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి ఫైళ్లు బయటకు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. ఫైల్స్ పడి ఉన్న వీడియో తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లే మెయిన్ గేటు దగ్గర ఉన్న సీసీ కెమెరాదని అధికారులు చెబుతున్నారు. అలాగే పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కూడా ఫైల్స్ వ్యవహారం కలకలంరేపింది. తహసీల్దారు కార్యాలయంలో ఫైల్స్ మాయం అయ్యాయని ప్రచారం జరిగింది.
పొన్నూరు సర్వే నంబరు 221-1బిలో సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన 25 ఎకరాల భూమి ఉంది. 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 25 ఎకరాల భూమిని నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరు పెట్టారు. కొందరు ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని ఒకరు ఫిర్యాదు చేయడంతో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఆ విచారణ నడుస్తుండగానే.. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి.
ఇటీవల ఎన్నికల సమయంలో ఆర్వో కార్యాలయాన్ని పొన్నూరు మున్సిపల్ కార్యాలయానికి మార్చారు.ఆ సమయంలో ఎన్నికల ఫైల్స్ దాచేందుకు కొత్త బీరువా కొనుగోలు చేయలేదు.. తహసీల్దారు కార్యాలయంలో ఉన్న దానిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. కొంత కాలం క్రితం కొందరు పట్టాదారులు తమకు డూప్లికేట్ పట్టాలు ఇవ్వమని కోరగా.. ఫైల్స్ కోసం కార్యాలయంలో అధికారులు వెతికారు. అయితే డీవీసీ కాలనీ చెందిన కీలక దస్త్రాలు కనిపించని మాట వాస్తవమేనని అధికారలుు చెప్పారు. అయితే ఈ ఫైల్స్ దొరికినట్లు తెలుస్తోంది.