బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసలో కొందరు అల్లరిమూకలు ఆందోళనలను ఆసరాగా చేసుకుని మతపరమైన దాడులకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకున్ని దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, హిందువులకు సంబంధించిన ఆస్తులను లూటీ చేయడం వంటి ఘటనలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే ముస్లిం సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు.. ఇలా మతపరమైన దాడులు ఆపాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో హిందూ ఆలయాలపై దాడులు చేయకుండా.. వాటికి ముస్లింలు కాపలాగా ఉండాలని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని హిందూ ఆలయాల ముందు ముస్లింలు కాపలాగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి.
మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఇప్పటికీ కొనసాగుతున్న తిరుగుబాటు సందర్భంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వస్తున్న వార్తలతో అనేక మంది రాజకీయ, విద్యార్థి నాయకులు.. హిందువుల ఆస్తులు, దేవాలయాలను కాపాడాలని తమ మద్దతుదారులను కోరుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని మతాల ప్రజల ఆస్తులను రక్షించాలని బంగ్లాదేశ్ జమాత్-ఎ-ఇస్లామీ అధ్యక్షుడు డాక్టర్ షఫీకర్ రెహ్మాన్ తన మద్దతుదారులను ఆదేశించారు. బంగ్లాదేశ్‌లో ఎవరూ మెజారిటీ కాదని.. ఎవరూ మైనారిటీ కాదని.. ఇక్కడ పుట్టిన వారంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ దేశ పౌరులేనని.. వారికి సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల ప్రభుత్వ భవనాలు, ఇళ్లు, ఆస్తులపై జరిగిన దాడిని కూడా ఖండించారు. ఇక బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా దాడులను ఖండించింది. ఏ ప్రత్యేక వర్గాన్ని వేధించవద్దని.. దేశంలో విభజన సృష్టించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, నాస్తికులు ఇలా ఎవరైనా సరే బంగ్లాదేశీయులమని బీఎన్‌పీ యాక్టింగ్ ఛైర్మన్ తారిక్ రెహమాన్ ట్వీ్ట్ చేశారు.
బంగ్లాదేశ్‌లో హింసాత్మకమైన నిరసనల మధ్య.. భారత మీడియాలో సోషల్ మీడియాలో.. హిందువులపై, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడుల గురించి వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ నేతలు స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నిరసనలకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థి సంఘం.. హిందువులను, ఆలయాలను కాపాడాలని తన మద్దతుదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అనేక మంది విద్యార్థులు, స్థానిక ముస్లింలు ఆలయాలకు కాపలాగా ఉన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఎలాంటి విధ్వంసానికి పాల్పడవద్దని.. మసీదుల్లో ఉన్న మైకుల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు.
షేక్ హసీనాకు అవామీ లీగ్‌లో చురుకుగా ఉన్న హిందువుల కొన్ని ఆస్తులపై దాడి జరిగిందని.. అయితే వారు హిందువులు అయినందుకు దాడులు జరగలేదని.. ఆ పార్టీ కార్యకర్తలు కావడంతోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాత్రిపూట దేవాలయాల ముందు కాపలాగా నిలబడిన ముస్లింలకు స్థానిక హిందువులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమకు అండగా నిలిచిన ముస్లింలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని.. ప్రతి ఒక్కరూ భద్రతను కాపాడుకోగలిగితే ఇలాంటి ఘటనలు జరగవని పేర్కొన్నారు. ఇక హిందువులపై ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని.. బంగ్లాదేశ్ నేషనల్ గ్రాండ్ అలయన్స్ సెక్రటరీ జనరల్ డాక్టర్ గోబింద చంద్ర ప్రమాణిక్ స్పష్టం చేశారు.