ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నియోజకవర్గ టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సూచించారు. దర్శిలో బుధవారం సాయంత్రం నియోజకవర్గంలోని తహసీల్దార్లతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సత్వరమే పనులు చేసి పంపాలని కోరారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. చిన్న చిన్న పనుల కోసం కూడా నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సందర్భాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తహసీల్దార్లు ఎం శ్రావణ్‌కుమార్, బీ రమాదేవి, రజనీకుమారీ, ఎల్ లక్ష్మీనారాయణ, పీ సింగారావులు తదితరులు పాల్గొన్నారు.