అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడమే టీడీపీ కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. పీసీపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్యాల జఫన్య అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఉగ్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధిని అటకెక్కించి బటన్‌లు నొక్కుతూ కాలక్షేపం చేసిందన్నారు. కనీసం ఫ్లోరిన్ పీడిత గ్రామాల్లో సురక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 2009-14సమయంలో రామతీర్ధ జలాలను మండలానికి తీసుకొచ్చానని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రతి ఇంటికీ సురక్షిత శుద్ధజలాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. వెంగళాయపల్లి సర్పంచ్ కరణం తిరుపతయ్య మాట్లాడుతూ తమ పంచాయతీ గ్రామాల్లోన్ని దివాకరపురం, మిట్టమీదపల్లి, వెంగళాయపల్లితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కిడ్నీ బాఽధితులు అధికంగా ఉన్నారన్నారు. పీసీపల్లిలో డయాలసిస్ సెంటరును ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ డయాలసిస్ సెంటరు ఏర్పాటు చేసేందుకు పీహెచ్‌సీలో అన్ని వసతులు కావాలని చెప్పిన ఆయన కనిగిరి పీహెచ్‌సీ సెంటరులోనే షిఫ్ట్‌ల వారీగా డయాలసిస్ చేయిస్తున్నామని, అలాగే మూత్రపిండాల వ్యాధిగ్రస్తులను డయాలసిస్ సెంటరుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.