విలువలు, విశ్వసనీయత వైయస్ఆర్‌సీపీ నైజమని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. పార్టీ ప్రజా ప్రతినిధులందరిదీ అదే బాట అని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఏకాభిప్రాయంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్ల వైయస్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పాడేరు నియోజకవర్గ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.... పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరపున ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. పాడేరు నియోజకవర్గంలో దాదాపుగా 85 స్ధానాల్లో ఎన్నికలు జరిగితే మనం 57 స్ధానాల్లో గెలిచాం. మామూలుగా అయితే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువులు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. కారణం 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే.. టీడీపీ వాళ్లు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెల్చారు. వారికి, మనకు దాదాపుగా 387 స్ధానాల తేడా ఉంది. గెలిచిన వాళ్లు అంతా మన పార్టీ గుర్తు, జెండా మీద గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదు. మీ జగనే ఈరోజు ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి ఉంటే.. వాళ్లకు అక్కడ మెజారిటీ ఉండి ఉంటే, మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్లం కాదు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లకు.. ప్రజలు ఆ పార్టీ గుర్తును చూసి వారికి ఓట్లేసి గెలిపిస్తే.. మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం. మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయని.. పోలీసులు, అధికారులు మన చేతిలో ఉన్నారని అధర్మంగానైనా గెలిచే కార్యక్రమం చేస్తే అది ఏ మాత్రం ధర్మం కాదు. కానీ, ఇక్కడ చంద్రబాబునాయుడు మాత్రం తన నైజం చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభపెడుతున్నారు. మనుషులను పంపించిన మరీ మీకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. అంటే ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో రాజకీయాల్లో విలువలును అట్టడుగు స్ధానంలోకి తీసుకుని పోయే కార్యక్రమం జరుగుతోంది. ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తేనే ఎదుగుతాడు. ఈ విలువలను, విశ్వసనీయతను వదిలి రాజకీయం చేయడం ఏ రోజైతే మనం మొదలుపెడతామే ఆ రోజు ప్రజలకు సమాధానం చెప్పడం మాట దేవుడెరుగు.. ఇంటిలో కూడా గౌరవం ఉండదన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. నేను నా జీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను, అమ్మ తప్ప ఎవరూ లేరు. మా ఇద్దరమే బయటకు వచ్చాం. నేను నా జీవితంలో అలాంటి రాజకీయాలే చేశాను. విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశాను. నేను అమ్మ ఇద్దరమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే.. నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పాను. అక్కడ నుంచి మొదలుపెడితే కేవలం ఇద్దరమే మొదలుపెట్టి దేవుని దయతో ప్రతి అడుగులో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశామని తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగలం అని వివరించారు.