కర్ణాటక - ఆంధ్ర ప్రదేశ్ మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుంది. రెండు రాష్ట్రాల అధికారులు పాలకులు కూడా కలిసి పని చేస్తే చాలా సమస్యలు తీరుతాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు వైపు ఏనుగుల సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు తగిన విధంగా సహకారం అందించడం సంతోషం కలిగించింది. ముఖ్యంగా 8 కుంకి ఏనుగులను ఆంధ్ర ప్రదేశ్ కు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం మంచి పరిణామం. ఈ రోజు సమావేశంలో ఏడు అంశాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తుండగా కర్ణాటక ప్రభుత్వం పట్టుకుంది. రూ. 140 కోట్ల వరకు అక్రమ రవాణా ఎర్రచందనాన్ని కర్ణాటక అటవీ సిబ్బంది పట్టుకున్నారు. ఎర్ర చందనంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.అటవీ సంపద రక్షణ కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైనా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఉపగ్రహ ఆధారిత నిఘాపెట్టి పూర్తిస్థాయి సేవలు వినియోగించుకునే అవకాశాలను భవిష్యత్తులో తీసుకువస్తాం.వన్యప్రాణులను చంపి స్మగ్లింగ్ చేసే వారిని కట్టడి చేసేలా రెండు రాష్ట్రాలు సమష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. వన్యప్రాణులను ఇష్టానుసారం వేటాడి స్మగ్లింగ్ చేసే వారిపై కఠినంగా ఉంటాం. తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు కర్ణాటక నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వీరికి అవసరమైన యాత్రి సదన్ నిర్మాణాల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం రెండు చోట్ల తగిన విధంగా భూములు కేటాయించాలని కోరింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు దృష్టికి అలాగే క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్తాము. ఎకో టూరిజం అభివృద్ధి విషయంలో కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఒక పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించాయి. ముఖ్యంగా సమావేశంలో జరిగిన ఏడు అంశాల చర్చ చేశాము. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎం.ఓ.యూ. చేసుకున్నాయి. దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు తగిన విధంగా పనిచేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటారు.