సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నంలో ట్రాఫిక్ రూల్స్ మారనున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం వాహనాలు నడిపితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఈ విషయమై విశాఖపట్నం పోలీసులు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ద్విచక్రవాహనం నడిపే వ్యక్తితో పాటుగా వారి వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విశాఖ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే హెల్మెట్ కూడా బీఐఎస్ మార్కు హెల్మెట్ అయ్యి ఉండాలని ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉన్నప్పటికీ సెప్టెంబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు విశాఖ పోలీసులు ప్రకటనలో తెలిపారు.
హెల్మెట్ వినియోగంపై ఇటీవలే ఏపీ హైకోర్టు పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి ద్విచక్ర వాహనదారుడితో పాటుగా అతని వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే.. జరిమానాతో పాటుగా వారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలు రద్దుచేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి కానీ.. లేదా అతని వెనుక కూర్చున్న వ్యక్తి గానీ, ఇద్దరిలో ఏ ఒక్కరు హెల్మెట్ ధరించకపోయినా రూ.1035 చలానా విధిస్తామని స్పష్టం చేశారు.
ఇక హెల్మె్ట్లు అమ్మే వ్యాపారులు కూడా బీఐఎస్ మార్క్ హెల్మెట్లు మాత్రమే అమ్మాలని.. బీఐఎస్ మార్క్ లేని హెల్మె్ట్లు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని విశాఖ నగర ప్రజలంతా దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో తప్పనిసరిగా బీఐఎస్ మార్క్ హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. అలాగే కారు నడిపే వ్యక్తి తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని.. మద్యం తాగి వాహనాలను నడపకూడదని సూచించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే నంబర్ ప్లేట్లు లేని వాహనాలను నడపరాదని సూచించారు.